Cock Fight: కోడి పందాలైనా, గుండాటైనా... యువతులూ తక్కువేం కాదు!

  • ముగిసిన సంక్రాంతి వేడుకలు
  • పందాల్లో ఉత్సాహంగా పాల్గొన్న అతివలు
  • మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బరుల నిర్వాహకులు

సంక్రాంతి ముగిసింది. మూడు రోజుల పండగ కోట్లాది మంది జీవితాల్లో మరపురాని అనుభూతులను మిగల్చగా, కోడిపందాలు, గుండాట, మూడు ముక్కలాట తదితరాల్లో లక్షల మంది కోట్ల రూపాయలను పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పండగ మూడు రోజుల్లో వందల కోట్లు చేతులు మారగా, ఎంతో మంది తమ ఏడాది సంపాదననూ పోగొట్టుకుని బాధపడుతున్నారు.

భోగి నాడు మొదలైన కోతాట, గుండాట, లోపలా బయట, పేకాట, కోడిపందాలు మూడు రోజులపాటు రేయింబవళ్లూ సాగాయి. ఈ జూదాల్లో డబ్బు సంపాదించే వారికన్నా, నిర్వాహకులకు సమర్పించుకుని వచ్చేవారే అత్యధికులని తెలిసి కూడా తమ వద్ద ఉన్న సమస్తమూ అక్కడ కోల్పోయారు.

ఇక, పందాల విషయంలో ఈ సంవత్సరం అమ్మాయిలు కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఉత్సాహంగా బరుల వద్దకు వస్తున్న మహిళలకు, యువతకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ స్వాగతం పలకడం గమనార్హం. వారికి ప్రత్యేకంగా కుర్చీలను కేటాయించి, వారికి కావాల్సిన కూల్ డ్రింక్స్, మంచినీరు, తినుబండారాలు తదితరాలను ఎప్పటికప్పుడు పంపుతూ, వారిని మరింతగా పందాల వైపు ప్రోత్సహించారు.

 కొన్ని బరుల వద్ద కేవలం మహిళల కోసమే పందాలు కూడా జరిగాయి. దీంతో, కోడిపందెమైనా, గుండాటైనా తాము కూడా సై అంటూ, ఎంతో మంది యువతులు పందాలు కట్టారు. పోలీసుల ఆంక్షలు ఏ మాత్రం కనిపించక పోవడంతో ఈ పందాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖకు, పోలీసులకు భారీగా ముడుపులు ఇచ్చిన బరుల నిర్వాహకులు తమవైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడకుండా చూసుకున్నారు.

ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 30 పెద్ద బరులు, 200 చిన్న బరులు ఏర్పాటుకాగా, పెద్ద బరికి రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకూ, చిన్న బరుల నుంచి రూ. 25 వేల చొప్పున అధికారులకు ముడుపులు అందినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో, బరుల వద్దకు పోలీసులు వెళ్లకుండా చూసేందుకు కొందరు ప్రజా ప్రతినిధులు సైతం నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకుంటే, మరికొందరు ప్రజా ప్రతినిధులు తామే స్వయంగా బరులను నిర్వహించారు. ఇక ఒక్కో పెద్ద బరి వద్ద కనీసం నాలుగు బెల్ట్ షాపులు మూడు రోజుల పాటూ నిరాటంకంగా సాగాయి. బెల్ట్ షాపులను పెట్టుకున్నవారు నిర్వాహకులకు ఓ 10 వేలు, ఎక్సైజ్ అధికారులకు మరో 10 వేలు ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News