Rema Rajeshwari: అమెజాన్‌లో అంతేమరి!.. కొబ్బరికాయ ఖాళీ చిప్ప ఖరీదెంతో తెలిస్తే షాకే!

  • ఈ-కామర్స్ సంస్థల మాయాజాలం
  • వైరల్ అవుతున్న ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి ట్వీట్
  • మండిపడుతున్న నెటిజన్లు

ఈ-కామర్స్ సంస్థల మాయాజాలాన్ని మరోమారు కళ్లకు కట్టే ఘటన ఇది. ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్‌లో ఓ కొబ్బరిచిప్పను, పక్కనే ఉన్న దాని ఖరీదును చూసిన ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. తన అనుభవాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకోవడంతో ఇప్పుడు ‘కొబ్బరి చిప్ప’ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కొబ్బరి చిప్ప కథాకమామీషు ఏంటో చూద్దాం..

సాధారణంగా కొబ్బరికాయ ధర మహా అయితే రూ. 30 ఉంటుంది. దీనిని కొట్టి కొబ్బరి తీసేసిన తర్వాత చెత్తబుట్టలో పారేస్తాం. అయితే, కొన్ని అవసరాల కోసం సరిగ్గా సగం ఉన్న ఖాళీ చిప్పలను విక్రయిస్తారు కూడా. అయితే వాటి ధర  పది రూపాయల లోపే ఉంటుంది. అయితే, రాజేశ్వరి అమెజాన్‌లో చూసిన సగం ఖాళీ కొబ్బరి చిప్ప ఖరీదెంతో తెలుసా? ఎందుకైనా మంచిది కాస్త గట్టిగా గాలి పీల్చి వదలండి. దాని ధర అక్షరాలా పద్నాలుగు వందల రూపాయలు!

పోనీ దానికేమైనా అదనపు హంగులేమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. ఓ మామూలు కొబ్బరి చిప్ప అంతే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కొబ్బరి చిప్ప అసలు ఖరీదు మూడు వేల రూపాయలట. 55 శాతం ఆఫర్ పోనూ రూ. 1,365కే విక్రయిస్తున్నారట. ఇందులో పట్టే నీళ్లెన్నో తెలుసా వంద మిల్లీ లీటర్లు. ఈ కొబ్బరి చిప్ప ధరపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అమెజాన్’లో అంతేమరి.. అని కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News