West Bengal: పేదల ఖాతాల్లోకి వచ్చి పడుతున్న డబ్బు... నరేంద్ర మోదీ వేయిస్తున్నారని ప్రచారం!

  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • 150 మంది పేదల ఖాతాల్లో రూ. 24 వేల వరకూ డబ్బు
  • యాక్సిస్ బ్యాంక్ నుంచి 'నిఫ్ట్' విధానంలో జమ
  • బ్యాంకుల వద్ద బారులు తీరుతున్న ప్రజలు

వారంతా నిరుపేదలు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. అటువంటి వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 24 వేల వరకూ డబ్బు జమ అయింది. దాదాపు 150 మంది ఖాతాల్లోకి ఇలా ఎవరు వేస్తున్నారో తెలీకుండా డబ్బులు వచ్చి పడ్డాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని పూర్వ వర్థమాన్ జిల్లాలో జరుగగా, విషయం ఆనోటా, ఈనోటా పాకి వైరల్ అయింది. దీంతో తమ ఖాతాలో ఏమైనా డబ్బు పడిందా? అంటూ వేలాది మంది బ్యాంకుల ముందు బారులు తీరారు.

ముఖ్యంగా కట్వా అనుమండల్ ప్రాంతంలోని ఖాతాల్లో యాక్సిస్ బ్యాంక్ నుంచి 'నిఫ్ట్' విధానంలో జనవరి 1న ఈ సొమ్ము జమైంది. ఈ మొత్తం ఎవరు జమ చేశారు? ఎందుకు చేశారన్న విషయమై బ్యాంకు అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక తమ ప్రభుత్వం వస్తే, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెప్పించి ఒక్కో బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న నరేంద్ర మోదీ, తానిచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నారని ఇక్కడి జనం చెప్పుకుంటుండటం గమనార్హం.

More Telugu News