Uttar Pradesh: ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించాలి : మాయావతి డిమాండ్‌

  • కోటా లేక ఉద్యోగాల్లో తగ్గుతున్న ముస్లింల సంఖ్య
  • ఒకప్పుడు మూడో వంతు ఉండేవారు...ఇప్పుడు మూడు శాతం దాటి లేరు
  • ఉత్తరప్రదేశ్‌లో ఫలితమే ఢిల్లీ ప్రధాని ఎవరన్నది తేలుస్తుందని వ్యాఖ్య

ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం రానురాను తగ్గిపోతోందని, అందువల్ల  ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్‌ కోటా కల్పించాలని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి డిమాండ్‌ చేశారు. తన 63వ జన్మదినోత్సవ సభలో మాయావతి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చే నాటికి 33 శాతంగా ఉన్న ముస్లిం ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 2 నుంచి 3 శాతం మధ్యకు పడిపోయిందన్నారు.

ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్‌ వల్ల వారికి మేలు జరుగుతుందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్రం ఇటీవల చేసిన ప్రకటన వల్ల ముస్లింలకు ఎటువంటి ఉపయోగం ఉండదని, వారికి ప్రత్యేక కోటా కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, అత్యధిక ఎంపీ సీట్లు సాధించి తనకు బహుమతిగా ఇవ్వాలని కోరారు.

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఎంపీ స్థానాలే ఢిల్లీలో ప్రధాని ఎవరన్నది నిర్ణయిస్తాయని చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మతాన్ని రాజకీయం చేస్తూ, నమాజ్‌ కూడా చేయకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.

More Telugu News