BJP: 13 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించడానికి 3,500 కిలోమీటర్లు ఎగిరివచ్చారా?: ప్రధాని మోదీకి ట్రోలింగ్

  • కొల్లామ్ బైపాస్ రోడ్డును ప్రారంభించిన ప్రధాని
  • సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్న నెటిజన్లు
  • మోదీపై విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ 

ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. కేరళలోని ఓ రోడ్డును మోదీ ప్రారంభించడంతో నెటిజన్లు ఆయనపై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. కేరళలో 13 కిలోమీటర్ల పొడవైన కొల్లామ్ రెండు వరుసల బైపాస్ రోడ్డును మోదీ నిన్న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రధాని కేరళకు వచ్చారు. దీంతో మోదీపై నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. కేవలం 13 కిలోమీటర్ల రోడ్డును ప్రారంభించడానికి 3,500 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తిని ఏమంటాం? ఆయన్ను అవకాశవాది అనాలా? లేక నిస్సహాయంగా మారిపోయారని చెప్పాలా? అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

గతంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కనీసం ఓ సీటీ స్కాన్ మెషీన్ ను అయినా ప్రారంభించారనీ, కానీ మోదీ మాత్రం అది కూడా చేయకుండా పోయారని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అనీల్ ఫిలిప్ అనే జర్నలిస్ట్ స్పందిస్తూ.. ఈ కొల్లామ్ బైపాస్ రోడ్డును నిర్మించాలని 47 క్రితం ప్రతిపాదన వచ్చిందనీ,  భూమిని 40 ఏళ్ల క్రితం సేకరించారని తెలిపారు.

ఈ రోడ్డు పనులు 28 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రతీఒక్కరూ రోడ్డును తామే నిర్మించామని క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఈ రోడ్డు వెడల్పు సాధారణ చీరంత కూడా ఉండదని ఎద్దేవా చేశారు. మరోవైపు సీపీఎం మద్దతుదారులు, కార్యకర్తలు అసహనంతోనే మోదీని ట్రోల్ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది.

More Telugu News