భారత యువతిని అసభ్యంగా తాకిన పాక్ దౌత్యాధికారి.. అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు!
- రాతపూర్వకంగా క్షమాపణ చెప్పిన దౌత్యాధికారి
- ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయిన యువతి
- భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్
ఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో షౌకత్ అనే అధికారి నేవల్ అడ్వైజర్ కు సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఓ షాపింగ్ మాల్ కు వెళ్లిన షౌకత్.. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ యువతిని అసభ్యంగా తాకాడు. వెంటనే స్పందించిన యువతి అతడి కాలర్ పట్టుకుని పోలీసులకు అప్పగించింది.
దీంతో అతడిని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి షౌకత్ రాతపూర్వకంగా సదరు యువతికి క్షమాపణలు చెప్పడంతో ఆమె ఫిర్యాదు ఇవ్వకుండానే వెనుదిరిగింది. కాగా, ఈ ఘటనపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్యాధికారులను పోలీసులు అదుపులోకి తీసుకోరాదనీ, తాజా చర్యతో భారత్ దాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది.