Uttar Pradesh: యూపీలో ప్రారంభమైన కుంభమేళా.. పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు!

  • భారీగా ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం
  • మహాశివరాత్రి వరకూ కొనసాగనున్న వేడుకలు
  • చిన్నారులు తప్పిపోకుండా ట్యాగ్ ల అందజేత

హిందువులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆధ్యాత్మిక వేడుక ‘కుంభమేళా’ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం 5.15 గంటలకు రాజయోగ స్నానాలతో కుంభమేళా ప్రారంభమయింది. మకరసంక్రాంతి  సందర్భంగా నేటి నుంచి మార్చి 4 అంటే మహాశివరాత్రి వరకూ ఈ కుంభమేళా సాగనుంది. ఈ ఉత్సవాల్లో దాదాపు 12 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గట్టి భద్రతతో పాటు భక్తుల కోసం 100 హెక్టార్లలో గుడారాలు ఏర్పాటు చేసింది.

ఇందుకోసం యూపీ ప్రభుత్వం రూ.4,300 కోట్లను వెచ్చించనుంది. వాస్తవానికి ఈ వేడుకను అర్ధకుంభమేళాగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ యూపీ ప్రభుత్వం మాత్రం కుంభమేళాగానే చెబుతోంది. ఇందుకోసం గంగా-యమున నదీతీరాన 32,000 హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్ నగరి ప్రపంచంలోనే తొలి అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు సృష్టించింది. మరోవైపు కుంభమేళా సందర్భంగా తప్పి పోయిన పిల్లలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌)ట్యాగ్‌లను అందజేస్తున్నారు. వొడాఫోన్ సంస్థ సాయంతో దాదాపు 40,000 రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లు అందజేశారు.

ఆరు రోజులు.. అత్యంత పవిత్రం
త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించేందుకు ఆరు రోజులు పవిత్రమైనవి. అవి మకర సంక్రాంతి పర్వదినం కాగా, పౌష్‌ పూర్ణిమ(జనవరి 21), మౌని అమావాస్య(ఫిబ్రవరి 4), వసంత పంచమి(ఫిబ్రవరి 10), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 19), ఆఖరిది మార్చి 4వ తేదీ మహాశివరాత్రి. కాగా, వీటిలో మొదటి, ఆఖరి రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు స్నానం చేయడం శుభప్రదంగా చెబుతారు.

More Telugu News