Indian Railway: రైలు డోర్ వద్ద నీలం రంగు లైట్లు.. ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వే కొత్త పద్ధతి!

  • ప్లాట్‌ఫాంలపై ప్రమాదాల నివారణపై రైల్వే ప్రత్యేక దృష్టి
  • బోగీ ద్వారంపై నీలం రంగు లైట్ల ఏర్పాటు
  • అవి వెలిగాయంటే రైలు కదులుతున్నట్టే

ప్లాట్‌ఫాంలపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఇండియన్ రైల్వే నీలం రంగు లైటు పద్ధతిని తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ విధానాన్ని ముంబైలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో రైలు బోగీకి ఉన్న ప్రతి ద్వారం పైన నీలం రంగు లైటును ఏర్పాటు చేస్తారు. రైలు కదిలే ముందు ఈ లైట్లు వెలుగుతూ ఉంటాయి. అవి వెలుగుతున్నాయంటే రైలు కదలబోతోందని, ప్రయాణికులు ఇక రైలు ఎక్కవద్దని అర్థం. ఈ లైట్లను గార్డు నియంత్రిస్తాడు.

 రైలు కదిలే సమయంలో లైటు కాంతి ప్లాట్‌ఫాంపై పడుతుందని, దానిని దాటి రావడం ప్రమాదమని చెప్పడమే వీటి ఉద్దేశమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్లాట్‌ఫాంలపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ముంబైలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ కావడంతో తొలుత అక్కడి లోకల్ రైళ్లలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. గతేడాది జనవరి-జూలై మధ్య కదులుతున్న రైళ్ల నుంచి కిందపడి 871 మంది గాయపడ్డారు.

More Telugu News