talasani: విజయవాడలో తలసాని ర్యాలీకి అనుమతించని పోలీసులు

  • యాదవ సమ్మేళనానికి హాజరైన తలసాని
  • ముందస్తు అనుమతి లేకపోవడంతో ర్యాలీకి నిరాకరించిన పోలీసులు
  • ఏపీలో యాదవులు రాజకీయంగా ఎదిగేందుకు అండగా ఉంటానన్న తలసాని

విజయడవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆర్కే కాలేజీలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే కాలేజ్ ఛైర్మన్ ఎం.కొండయ్య, ఇతర యాదవ నేతలు తలసానికి ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి కనకదుర్గ అమ్మవారి ఆలయం వరకు నిర్వహించాలనుకున్న ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో, ర్యాలీకి అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేవలం ఐదు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.

మరోవైపు ఆత్మీయసభలో తలసాని మాట్లాడుతూ, తెలంగాణలో యాదవులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. చట్టసభల్లో యాదవులకు తగినన్ని అవకాశాలను ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో యాదవులు ఎదగాలని ఆకాంక్షించారు. యాదవులంతా సంఘటితం కావాలని... సంఖ్యాబలాన్ని చూపాలని పిలుపునిచ్చారు. ఆంధ్రలో యాదవులు రాజకీయంగా ఎదిగేందుకు అండగా ఉంటానని చెప్పారు. ఏపీలో బీసీలకు తగిన గుర్తింపు లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో యాదవులకే కాకుండా బీసీలందరికీ నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 

More Telugu News