Bhogi: సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. తెలుగు లోగిళ్ల సందడిది!

  • మూడు రోజుల సంక్రాంతి ఉత్సవాలకు బోగి మంటలతో స్వాగతం
  • ఎక్కడ చూసినా పండగ వాతావరణమే
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్

తెలుగు రాష్ట్రాల్లో బోగి పండగ మొదలైపోయింది. మూడు రోజుల సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నేడు తెల్లవారుజామున లోగిళ్ల ముందు బోగి మంటలు మండాయి. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. పల్లెల్లో తెలుగు సంస్కృతి ఉట్టిపడుతోంది. పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరించి ఉత్సాహంగా పండగ జరుపుకుంటుండగా, తెలుగు లోగిళ్లు సందడిగా మారాయి. విజయవాడతో పాటు కోనసీమ, గుంటూరు మిర్యాలగూడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలంతా బోగి మంటల వెలుగుల్లో సంక్రాంతికి స్వాగతం పలికారు.

గుంటూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో భారీఎత్తున బోగి మంటలు వేశారు. ఇక సంక్రాంతి సందడిని పెంచేలా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రజలను, ముఖ్యంగా చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు చోట్ల వివిధ సంఘాలు ముగ్గుల పోటీలు, వంటల పోటీలను నిర్వహిస్తున్నాయి.

ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావు తన నివాసం వద్ద పండగ చేసుకున్నారు. ఎంపీ మాగంటి బాబు ఏలూరులో బోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. నారా లోకేశ్, ఈ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి మధ్యాహ్నం నుంచి నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబీకులంతా రెండు రోజుల వేడుకల్లో పాల్గొననున్నారు.

More Telugu News