indian army: అమ్మాయి ఎరతో.. భారత్‌ సైనిక రహస్యాల కోసం పాకిస్థాన్ ఐఎస్‌ఐ గూఢచర్యం

  • జవాన్లపై ఓ యువతి వలపు వల
  • ఫేస్‌బుక్‌ పరిచయం ద్వారా సైనిక రహస్యాలపై కన్ను
  • గుట్టురట్టు చేసిన సైనికాధికారులు

భారత్‌ సైనిక రహస్యాలు సేకరించేందుకు అనుక్షణం అడ్డదారులు వెదికే పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఈసారి తమ దేశపు మహిళను భారత్‌ సైనికులపైకి ప్రయోగించింది. గతంలోనూ ఇటువంటి ప్రయత్నం జరిగినా ఈసారి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ వేదికగా కథ నడిపించింది. భారత్‌ సైనిక అధికారులు అప్రమత్తం కావడంతో గుట్టు రట్టయింది. ఒక జవాన్‌ అరెస్టయ్యాడు.

 వివరాల్లోకి వెళితే...సిపాయ్‌ సోమ్‌వీర్‌ సింగ్‌ 2016లో భారత్‌ సైన్యంలో చేరాడు. కొన్నిరోజులకే అతనికి కెప్టెన్‌ అనికా చోప్రా పేరుతో ఫేస్‌ బుక్‌లో ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. అదో అరుదైన సందర్భంగా భావించిన సోమ్‌వీర్‌ ఆమెతో స్నేహం కలిపాడు. రానురాను అనికా మాయలో నిండా మునిగిపోయాడు. అప్పటికే పెళ్లయిన సోమ్‌వీర్‌ తన భార్యకు విడాకులిచ్చి అనికా చోప్రాను పెళ్లి చేసుకోవాలన్న స్థాయికి చేరుకున్నాడు. సోమ్‌వీర్‌ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన సైన్యంలోని నిఘా విభాగం అతనిపై కన్నేసింది.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పనిచేస్తున్న సోమ్‌వీర్‌ సింగ్‌కు ఐదు నెల నుంచి క్రమం తప్పకుండా జమ్ము ప్రాంతం నుంచి ఫోన్లు రావడం గుర్తించిన నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. అతని ఫేస్‌బుక్‌ చాటింగ్‌, సంభాషణలను గుర్తించారు. కెప్టెన్‌ అనికాచోప్రా పేరుతో అతనితో టచ్‌లో ఉన్న యువతి పాకిస్థాన్‌ వాసి అని గుర్తించారు. తొలిరోజుల్లో 'నువ్వెక్కడ పనిచేస్తున్నావ్‌, నీవు పనిచేసే యుద్ధ ట్యాంక్‌ ఫొటో పంపగలవా, క్షేత్రస్థాయి సైనిక విన్యాసాలు ఎప్పుడు నిర్వహిస్తారు' వంటి వివరాలను సోమ్‌వీర్‌ నుంచి అనిత రాబట్టింది. ఇలా కొంత ప్రాథమిక సమాచారం సోమ్‌వీర్‌ నుంచి రాబట్టాక వాటినే చూపి అతడిని బెదిరించడం మొదలుపెట్టింది.

దీంతో ఆ తర్వాత సోమ్‌వీర్‌ ఆమె వద్ద డబ్బులు తీసుకుని అడిగిన సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాడు. తాను పనిచేస్తున్న సైనిక కేంద్రానికి సంబంధించిన సున్నితమైన సమాచారం, ఫొటోలు, సైనిక విన్యాసాల ఫోటోలు పంపుతున్న అతడిని సైనికాధికారులు పట్టుకున్నారు. అతని నుంచి విలువైన సమాచారం సరిహద్దులు దాటిందని గుర్తించారు. ముఖ్యంగా ఆర్మీకి చెందిన ఆయుధాలు, ట్యాంకర్లు, వాహనాలు, రహస్య స్థావరాల ఫొటోలను కూడా పంపినట్లు గుర్తించారు. విచారణలో పలు ఆశ్చర్యకరమైన అంశాలు కూడా వెల్లడి కావడంతో సోమ్‌వీర్‌పై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

పాకిస్థాన్‌ గూఢచారి అనికాచోప్రా చర్యలు సోమ్‌వీర్‌తోనే ఆగిపోలేదని, రకరకాల పేర్లతో మరో 50 మందిపై కూడా వల విసిరిందని సైనిక నిఘా అధికారులు గుర్తించారు. అనికా పోస్టింగ్‌కు పలువురు కామెంట్లు, లైక్‌లు ఇవ్వడాన్ని గుర్తించారు. అనికా ఒక్కో సైనికుడికి ఒక్కో నిర్దిష్ట సమయం కేటాయించేదని, ఆ సమయంలోనే వారితో ఫేస్‌బుక్‌ సంభాషణ చేసేదని కూడా గుర్తించారు. వీరందరినీ ప్రస్తుతం రాజస్థాన్‌ సైనిక అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ ఎటువంటి సమాచారం వీరి నుంచి ఐఎస్‌ఐకి వెళ్లిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News