Pawan Kalyan: అప్పుడు జగన్‌ను అడ్డుకున్న వాళ్లే.. ఇప్పుడు ఇక్కడికొచ్చి మద్దతు ఇస్తామంటున్నారు: టీఆర్ఎస్ పై పవన్ విమర్శలు

  • రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి
  • ప్రజల్లో ప్రశ్నించే గుణం పెరగాలి
  • అవినీతి చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా?
తెలంగాణ ఉద్యమ సమయంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని అడ్డుకున్న వారే ఇప్పుడు ఏపీకి వచ్చి ఆయనకు మద్దతు ఇస్తామని అంటున్నారంటే రాజకీయాలు ఎంతెలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం తెనాలిలోని పెదరావూరు వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన పవన్ అక్కడి బహిరంగ సభలో మాట్లాడారు.

ఓపక్క తాను మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు, మరోపక్క తాను వస్తే మూడు దశాబ్దాలు ఏలుతానంటూ జగన్ ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేసిన పవన్.. వారొచ్చి అవినీతి చేయాలని చూస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే జనసేన అధికారంలోకి రావాల్సిందేనన్నారు.

టీడీపీ వెన్నుపోటు, వైసీపీ అవినీతి పునాదులపైనా ఏర్పడ్డాయని పవన్ ఆరోపించారు. అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని అడిగితే వైసీపీ వాళ్లు, ఇసుక మాఫియా గురించి మాట్లాడితే టీడీపీ వాళ్లు తనను తిడుతున్నారని పవన్ అన్నారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని, తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్‌ను అడ్డుకున్న వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరీ ఆయనకు మద్దతు ఇస్తామని అంటున్నారని పరోక్షంగా టీఆర్ఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు.
Pawan Kalyan
Jagan
Chandrababu
Andhra Pradesh
Jana Sena
Guntur District
tenali

More Telugu News