Rahul Gandhi: 'స్త్రీ ద్వేషి' ఆరోపణలపై రాహుల్ స్పందనిది!

  • రాఫెల్ డీల్ పై సమాధానం ఇచ్చిన నిర్మలా సీతారామన్
  • ఆపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
  • ఎవరున్నా అలాగే మాట్లాడేవాడినన్న రాహుల్

గత వారంలో పార్లమెంట్ లో రాఫెల్ డీల్ పై చర్చ జరుగుతున్న వేళ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సైతం స్పందించింది. సుమోటోగా కేసు పెడుతూ, మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ నోటీసులు పంపింది.

ఇక దీనిపై రాహుల్ మాట్లాడుతూ, తాను ఏ మహిళనూ ఉద్దేశించి మాట్లాడలేదని, నిర్మలా సీతారామన్ స్థానంలో ఎవరున్నా అలాంటి వ్యాఖ్యలే చేసేవాడినని అన్నారు. అనిల్ అంబానీకి 30 వేల కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెట్టి, తనను తాను రక్షించుకోలేక, మరో వ్యక్తిని నరేంద్ర మోదీ సభలోకి పంపారని అన్నారు. ఆ వ్యక్తి మహిళ కావడం యాదృచ్ఛికమేనని, ఆమె బదులు మరో పురుషుడు మాట్లాడినా, తన ప్రసంగం మారేది కాదని అన్నారు.

బుధవారం నాడు ఓ రైతు ర్యాలీలో మాట్లాడిన రాహుల్, 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకు తిరిగే ఓ కాపలాదారు, మహిళతో తనను కాపాడాలని వేడుకున్నారని, తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్న ఆయన, ఓ మహిళను అడ్డు పెట్టుకున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News