Congress: వైఎస్సార్‌ ఎప్పటికీ కాంగ్రెస్‌ నాయకుడే: ఏఐసీసీ కార్యదర్శి మొయిప్పన్‌

  • ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన పథకాలు కాంగ్రెస్‌ సొంతం
  • జగన్‌ వైఎస్సార్‌ వారసుడు కాలేరు
  • రానున్న ఎన్నికల్లో పొత్తు నిర్ణయం అధిష్ఠానందే

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి మొయిప్పన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ నాయకుడని, ఎప్పటికీ ఆయన తమ పార్టీ సొత్తు అని అన్నారు. వైఎస్‌ వారసుడిగా జగన్‌ చెప్పుకుంటున్నా, అది చెల్లుబాటుకాదన్నారు. కడప జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజశేఖర్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని, ఆయన అమలు చేసిన పథకాలు కూడా కాంగ్రెస్‌ సొంతమన్నారు. తమ పార్టీ పథకాలను కాపీకొట్టి జగన్‌ ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీతో ఆయన ఇప్పటికే మిలాఖత్‌ అయ్యారని, ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ తేల్చిచెప్పినా పాదయాత్రలో కనీసం ఆ పార్టీని ప్రశ్నించలేకపోయారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హోదా ఇచ్చే విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టమైన వైఖరితో ఉన్నారన్నారు. దుబాయ్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ హోదాపై రాహుల్‌ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు అంశం అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో సమర్థులకే టికెట్లు కేటాయిస్తామని తెలిపారు.

పదవుల కోసం కాంగ్రెస్‌ పాకులాడదని, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. బూత్‌ స్థాయి అధికారులకు త్వరలో శిక్షణ ఇస్తామని చెప్పారు. హైకమాండ్‌ శక్తి ప్రాజెక్టు ద్వారా కార్యకర్తలు తమ పేర్లను మొబైల్‌, ఓటరు గుర్తింపు కార్డు ద్వారా నమోదు చేసుకోవాలని, రాహుల్‌గాంధీ కార్యకర్తలతోనే నేరుగా మాట్లాడుతారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటున్నా పుంజుకుంటోందని తెలిపారు.

More Telugu News