Nellore: ఒకే రోజు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి: సీఎం చంద్రబాబునాయుడు

  • తద్వారా లక్షా ముప్పై వేల ఉద్యోగాలు లభిస్తాయి
  • నాపై నమ్మకం ఉంటేనే కదా పెట్టుబడులు వచ్చింది
  • ‘జన్మభూమి-మా ఊరు’ సభలో పాల్గొన్న చంద్రబాబు

ఒకే రోజు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత తమదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని బోగోలులో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం ఇక్కడికి సమీపంలోని రామాయపట్నం పోర్ట్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని, నాలుగు వేల ఐదువందల కోట్ల రూపాయలతో ఏర్పాటు కాబోయే ఈ పోర్టు రాబోయే రెండేళ్లలో అందుబాటులోకొస్తుందని చెప్పారు.

అదేరోజున, ఇండోనేషియాకు చెందిన పేపర్ మిల్స్ సంస్థ ఇక్కడ కాగితపు పరిశ్రమ ఏర్పాటుకు పునాది వేసిందని గుర్తుచేశారు. ఈ పరిశ్రమను రూ.24 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నారని, దేశంలో ఇప్పటి దాకా వచ్చిన అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు. తన విధానం చూసిన అదానీ కూడా అదేరోజున వచ్చారని, రూ.70 వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్, దానికి అవసరమైన విద్యుత్ నిమిత్తం సోలార్ ఎనర్జీ సెంటర్ కు శ్రీకారం చుట్టారని, అంటే, ఒకే రోజు..లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా లక్షా ముప్పై వేల ఉద్యోగాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు. ‘తమ్ముళ్లూ, ఇది నమ్మకం ఉంటే జరిగిందా? లేక నమ్మకం లేకపోతే జరిగిందా?’ అని ప్రశ్నించారు.

More Telugu News