సంగీతను తొలిసారి అప్పుడే చూశా.. మాజీ భార్య గురించి అజారుద్దీన్

11-01-2019 Fri 08:48
  • 1985లో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో చూశా
  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అదే
  • ఎవరూ చెప్పని విషయాలను చెప్పేశా

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తన తొలి ప్రేమకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. మాజీ భార్య, బాలీవుడ్ నటి సంగీతా బిజ్‌లానీతో ప్రేమ విషయాలను బయటపెట్టాడు. సంగీతను తొలిసారి 1985లో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ సందర్భంగా చూసినట్టు చెప్పాడు. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే భావన అప్పుడే తనలో కలిగిందన్నాడు. ఇటువంటి విషయాలను ఎవరూ పంచుకోరని, కానీ తాను వెల్లడించినట్టు చెప్పాడు.

అజారుద్దీన్‌కు సంగీత రెండో భార్య. వీరిద్దరి దాంపత్య జీవితం 1996లో మొదలై 2010లో ముగిసింది. క్రికెట్‌కు, బాలీవుడ్‌కు మధ్య చాలాకాలం నుంచి సంబంధాలు ఉన్నాయన్న అజర్.. మన్సూర్ అలీఖాన్ పటౌడీ వల్లే ఆ సంబంధం ఏర్పడిందన్నాడు. అయితే, ఇది మనసుకు సంబంధించిన విషయమన్నాడు. ఇద్దరు స్టార్లు పెళ్లి చేసుకోవడం వల్ల ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం సులభమవుతుందని అజర్ అభిప్రాయపడ్డాడు.

టీమిండియా క్రికెటర్లలో విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న అజర్ ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యాడు. 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన అజర్ అనంతరం రాజకీయాల్లో చేరాడు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు.