rajya sabha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈబీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి: కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్

  • ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయగానే రిజర్వేషన్లు
  • ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం  
  • కానీ, చట్టసభల్లో రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకే ఉన్నాయి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన మరుక్షణం నుంచే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెప్పారు.

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆర్టికల్ 15, 16కు క్లాజ్ (6) అదనంగా జోడిస్తున్నామని, రాజ్యాంగంలోని 46వ అధికరణ ఇదే మార్గనిర్దేశనం చేస్తోందని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తోందని అన్నారు. సిన్హా కమిషన్ నివేదికలో ఈబీసీలకు రిజర్వేషన్ల ప్రస్తావన ఉందని, 2010లో యూపీఏ హయాంలోనే సిన్హా కమిషన్ నివేదిక సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటి వరకూ రిజర్వేషన్లలో విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించారు కానీ, చట్టసభల్లో రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉన్నాయని అన్నారు.

మహిళలు యుద్ధవిమానాలు నడిపే అవకాశం కల్పించింది, గణతంత్ర వేడుకల్లో బీఎస్ఎఫ్ మహిళా జవాన్లకు అవకాశం  కల్పించింది తమ ప్రభుత్వమేనని అన్నారు నాలుగున్నరేళ్లలో రూ.9.5 కోట్ల శౌచాలయాలు నిర్మించామని, మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 6 నెలలకు పొడిగించామని, జన్ ధన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ జరుగుతోందని, డిజిటల్ చెల్లింపుల రూపంలో కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయని తెలిపారు.

విమానయాన సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని, ఈ బిల్లును ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారని అందరూ ప్రశ్నిస్తున్నారని, అన్ని వర్గాల్లోని పేదలకు న్యాయం చేయాలన్నదే మోదీ సర్కార్ సంకల్పమని, అందువల్లే, ఈ బిల్లు తీసుకొచ్చామని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీఏ, బీజేపీ, మోదీకి ప్రజలు ఘన విజయం అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News