ola: సేవా లోపం ఎఫెక్ట్‌: ఓలా సంస్థకు వినియోగదారుల ఫోరం జరిమానా

  • ఓలా వల్లే తాను పరీక్ష రాయలేకపోయానని ఓ విద్యార్థి ఫిర్యాదు
  • బుక్‌ చేసిన తర్వాత ఫోన్‌కి వచ్చిన డ్రైవర్‌ వివరాలు
  •  పలుమార్లు ఫోన్‌ చేస్తే వస్తున్నానని చెప్పి చివరికి సర్వీస్‌ క్యాన్సిల్‌

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలాకు వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. కస్టమర్‌కు అందించే సర్వీస్‌ లోపం వల్ల అతను నష్టపోయాడని భావించిన కోర్టు ఫిర్యాదు దారునికి రూ.10 వేల పరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ హరిపురం కాలనీకి చెందిన ఎన్‌.శ్రీధర్‌ 2017 మే 27న కేశవ మెమోరియల్‌ కళాశాలలో జరిగిన ఎల్‌ఎల్‌ఎం పరీక్షకు హాజరు కావల్సి ఉంది. దీంతో ఆయన ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన ఓలా క్యాబ్‌ను బుక్‌ చేశాడు.

బుకింగ్‌ను ఖాయం చేస్తూ క్యాబ్‌ నంబరు, డ్రైవర్‌ సుధీర్‌ పేరుతో శ్రీధర్‌ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపారు. 2.30 గంటలకు పరీక్ష కావడంతో శ్రీధర్‌ క్యాబ్‌ డ్రైవర్‌కు ఫోన్‌ చేశాడు. రెండు నిమిషాల్లో వస్తున్నానన్నాడు. అయితే రాలేదు. పలుమార్లు శ్రీధర్‌ ఫోన్‌ చేయగా వస్తున్నానని చెప్పిన డ్రైవర్‌ చివరికి బుకింగ్‌ రద్దు చేసినట్లు తెలిపాడు. దీంతో శ్రీధర్‌ సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయాడు.

క్యాబ్‌ సంస్థ నిర్లక్ష్యం వల్లే తాను పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయానని శ్రీధర్‌ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. బెంగళూరులోని సంస్థ నిర్వాహకుడు, కూకట్‌పల్లిలోని దాని శాఖ నిర్వాహకుడు, డ్రైవర్‌ సుధీర్‌లను ప్రతివాదులుగా చేర్చాడు. కేసు విచారించిన న్యాయమూర్తి ఓలా సంస్థ లోపం ఉందని తేల్చి ఈ విధంగా తీర్పు చెప్పింది.

More Telugu News