West Bengal: ప్రధాని కావాలన్న మమత కోరిక తీరాలని కోరుతున్నా... కానీ మళ్లీ ప్రధాని మోదీయే!: బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌

  • పశ్చిమబెంగాల్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు
  • మమతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా వ్యాఖ్య
  • మహాకూటమిలో ఆమే అర్హురాలని ప్రశంస

'ప్రధాని కావాలని ఆశిస్తున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుతున్నాను. కాకుంటే ఆమెకు పరిస్థితులు అనుకూలంగా లేవు. రానున్న ఎన్నికల్లోనూ మళ్లీ మోదీయే ప్రధాని అవుతారు’ అని పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ఘోష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహాకూటమి రూపుదిద్దుకుంటే ఆ కూటమిలో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అవుతారని ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ శ్రేణులు అన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం మమతా బెనర్జీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దిలీప్‌ఘోష్‌ ఇలా వ్యాఖ్యానించారు.

ఓ వైపు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పట్టుకోసం బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘గతంలో పశ్చిమ్‌ బంగ నుంచి ప్రధాని అయ్యే అవకాశం జ్యోతిబసుకు వచ్చింది. సీపీఎం అందుకు అంగీకరించ లేదు. ఇప్పుడు బెంగాల్‌ నుంచి ఎన్నుకుంటే మమతకే మొదటి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ప్రధాని కావాలని ఆమె కలలు కంటున్నారు. ఆమె ఎంపిక కూడా ఉత్తమంగానే ఉంటుంది.

ఆమెకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నా’ అని దిలీప్‌ఘోష్‌ అన్నారు. కాకపోతే మహాకూటమికి పరిస్థితులు అనుకూలంగా లేవని, పరిస్థితులన్నీ మోదీకే అనుకూలంగా ఉన్నందున ఆయనే మళ్లీ ప్రధాని అవుతారని చెప్పారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని మమత అడ్డుకున్న విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు.

More Telugu News