toll plaza: టోల్‌ప్లాజా ఫాస్ట్‌ట్యాగ్‌లు ఇకపై పెట్రోల్‌ బంక్‌ల్లో అమ్మకం

  • ఆయిల్‌ పోయించుకున్నప్పుడే కొనుక్కోవచ్చు
  • ఆటోమేటిక్‌ చెల్లింపులకు వీటితో అవకాశం
  • ప్రస్తుతం అధీకృత బ్యాంక్‌ల్లోనే విక్రయం

జాతీయ రహదారిపై నిత్యం ప్రయాణిస్తుంటారా...టోల్‌ ఫీజు చెల్లించేందుకు ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తోందని బాధపడుతున్నారా? ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. బంక్‌కు వెళ్లి పెట్రోల్‌ పోయించుకున్నప్పుడు మీరు దాటనున్న టోల్‌ఫ్లాజా ఫాస్ట్‌ ట్యాగ్‌ను కూడా కొనుక్కోవచ్చు. ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఈ విక్రయాలకు సంబంధించి శనివారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పటి వరకు అధీకృత బ్యాంకుల ఆధ్వర్యంలోనే వీటిని విక్రయిస్తున్నారు. తొలిదశలో వీటిని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలోని 50 పెట్రోల్‌ బంక్‌ల్లో విక్రయిస్తారు. కాలక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్‌ బంక్‌లకు విస్తరిస్తారు. టోల్‌ప్లాజా వద్ద కాలహరణంపై వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో హైవే మేనేజ్‌మెంట్‌ కంపెనీ 2016 ఏప్రిల్‌ నుంచి ‘ఫాస్ట్‌ట్యాగ్‌’ పేరుతో ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 450 టోల్‌ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌ చెల్లింపుల విధానం అమల్లో ఉంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్‌-జీఎస్‌టీని కలిపి దేశంలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద అనుమతించే ఏర్పాటు చేయడంతో వీటి అవసరం బాగా పెరిగింది. దీంతో ఇవి వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి తేవడానికి పెట్రోల్‌ బంకుల్లో కూడా విక్రయించాలని నిర్ణయించారు. అదేసమయంలో ఐఎంహెచ్‌సీఎల్‌ మైఫాస్ట్‌ట్యాగ్‌, ఐహెచ్‌ఎంసీఎల్‌ పీఓఎస్‌ పేరుతో రెండు మొబైల్‌ అప్లికేషన్లను కూడా ఈ కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. ఈ యాప్స్‌ అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఫాస్ట్‌ట్యాగ్‌లను తమ బ్యాంకు ఖాతాలతో అనుసంధానించుకుని యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకోవచ్చు.

More Telugu News