KTR: కేసీఆర్ కు ఇక్కడ చాలా పని ఉంది.. పార్లమెంటుకు ఎందుకు వెళతారు?: కేటీఆర్

  • 16 లోక్ సభ సీట్లలో విజయం ఖాయం
  • ఖమ్మం, మహబూబాబాద్ లలోనే ఓట్లు తగ్గాయి 
  • కాంగ్రెస్ కు అభ్యర్థులు కూడా లభించని పరిస్థితి 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ రాజకీయాలపై దృష్టిని సారించారని, ఆయన ఎంపీగా పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్న వేళ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు స్పందించారు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఆయనకు ఎంతో పని ఉందని, ఈ సమయంలో పార్లమెంట్ కు ఎందుకు వెళతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు.

ఖమ్మం, మహబూబాబాద్ లో మాత్రమే తమకు ఓట్ల శాతం తగ్గిందని, అయినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అక్కడ కూడా గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయనివారు లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపే నిలబడనున్నారని అన్నారు. సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ కు ఎంపీ అభ్యర్థులు కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టాలంటే, అక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన కేటీఆర్, కోదండరామ్ ను ప్రజలు తిరస్కరించారని, ఇక ఆయన రాజకీయాల్లో ఉండాలో వద్దో ఆయనే నిర్ణయించుకోవాలని అన్నారు.

More Telugu News