Andhra Pradesh: శివాజీ వెనుక టీడీపీ ఉంది.. అది చెప్పుకోవడానికి అతను సిగ్గుపడుతున్నాడేమో!: పృథ్వీ సెటైర్

  • సమయం వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలుస్తుంది
  • వైఎస్ కుటుంబం మొదట్నుంచి మైనింగ్ బిజినెస్ లో ఉంది
  • పేదల వైద్యానికి వైఎస్ వందల ఎకరాలు అమ్మేశారు

‘ఆపరేషన్ గరుడ’ అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు పృథ్వీ తప్పుపట్టారు. జగన్ పై కోడికత్తితో దాడి జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు చాలా అవహేళన చేశారని ఆయన విమర్శించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి, వైసీపీకి ఓట్లలో తేడా కేవలం 1.9 శాతం మాత్రమే ఉందని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి పెద్దగా ఊపేసే మెజారిటీ ఏమీ రాలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడారు.

ఒక జంతువుకు దెబ్బ తగిలితేనే నాలుగు జంతువులు చుట్టూ చేరుతాయనీ, ఆపాటి ఇంగిత జ్ఞానం కూడా కొందరికి లేదని దుయ్యబట్టారు. జగన్ పై దాడి జరగ్గానే అమెరికాకు వెళ్లిపోయిన శివాజీ మళ్లీ తిరిగి వచ్చి ‘నన్ను ఏం చేస్తారు?’ అంటూ మీసాలు మెలేస్తున్నారనీ, సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అప్పుడే తొందరపడితే ఎలా? అని ప్రశ్నించారు. తాతలను, తండ్రులను అడ్డుపెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు అంటూ శివాజీ జగన్ ను టార్గెట్ చేస్తున్నారని స్పష్టం చేశారు. రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబం మైనింగ్ బిజినెస్ లో ఉందని గుర్తుచేశారు.

ప్రజలకు రూ.2కే వైద్యం చేస్తూ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి వందలాది ఎకరాల భూమిని అమ్ముకున్నారని తెలిపారు. ఈ విషయంలో రాజారెడ్డి చాలాసార్లు వైఎస్ ను హెచ్చరించారని, అయినా కూడా ఆయన తనపని తాను చేశారని చెప్పారు. తెలుగుదేశం వేదికలపై ఉండే శివాజీ తన వెనుక ఎవరూ లేరని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. శివాజీ వెనుక టీడీపీ ఉందని స్పష్టం చేశారు. తాను టీడీపీ నేతను అని ప్రకటించుకోవడానికి శివాజీ సిగ్గు పడుతున్నారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News