Andhra Pradesh: మే నెలలో పోలవరంలో నీళ్లు ఉండవని చెప్పినా చంద్రబాబు వినలేదు.. అప్పుడే ప్రారంభిస్తామన్నారు!: ఉండవల్లి

  • ఏపీ శ్వేతపత్రాల్లో అసత్యాలు
  • రూ.20 కోట్లు ఖర్చుపెట్టి పోలవరం టూర్లు వేస్తున్నారు
  • మీడియా సమావేశంలో ఉండవల్లి ఫైర్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈసారి ఇచ్చిన శ్వేతపత్రాల్లో అసత్యాలు ఉన్నాయని అనుమానం కలుగుతోందని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రాజకీయ నాయకులు కాకుండా అధికారుల సమక్షంలో వీటిపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై స్పందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు.

పోలవరం ద్వారా మే నెలలో నీళ్లు ఇస్తామని గతంలో చాలాసార్లు చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. దీంతో తాను స్పందిస్తూ.. ‘దయచేసి ఇలాంటి మాటలు చెప్పకండి. అలా చేయడం కుదరదు. ఎందుకంటే మే నెలలో నదిలో నీళ్లు ఉండవు’ అని చెప్పానని అన్నారు. అయినా ప్రభుత్వం వినిపించుకోలేదన్నారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను డ్యామ్ వద్దకు తీసుకెళ్లి పోలవరం ఎలా కడుతున్నామో చూపిస్తోందని విమర్శించారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉన్నప్పుడు ప్రతీదానికీ తాత్కాలిక భవనాలు కట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీ జరిగినా, ప్రతిపక్షం రాదనీ, తిరుగుబాటు చేసిన బీజేపీ కూడా పెద్దగా ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

వైజాగ్ లో చంద్రబాబు మూడు సార్లు మీటింగులు పెట్టి రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు శ్వేతపత్రంలో ప్రకటించారని అన్నారు. ఇదంతా తప్పుడు డేటా అనీ, ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించినట్లు చెబుతున్న కొన్నిచోట్ల తాను పర్యటించాననీ, అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవని స్పష్టం చేశారు.

More Telugu News