Andhra Pradesh: దుక్కలా ఉంటారు.. పెన్షన్ కావాలంటారు.. వితంతువులపై నోరు జారిన ఏపీ మంత్రి!

  • జన్మభూమిలో అయ్యన్న వివాదాస్పద వ్యాఖ్యలు
  • వేధించినందునే భర్తలు వెళ్లిపోయారన్న టీడీపీ నేత
  • ఇలాంటి దిక్కుమాలిన కేసులు ఊరికి 2-3 ఉన్నాయన్న మంత్రి 

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదంలో చిక్కుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా వితంతువులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దుక్కలా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా ఇస్తామండీ? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

జన్మభూమి కార్యక్రమం సందర్భంగా నిన్న విశాఖలో నిర్వహించిన సమావేశంలో మంత్రి అయ్యన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన మహిళలు, వితంతువులను ఉద్దేశించి మాట్లాడుతూ..‘దుక్కలా ఉండి పెన్షల్ కావాలంటే ఎవరు ఇస్తారండి? ఊర్లలో కొంతమంది మహిళలు భర్త ఉన్నాడా? అని అడిగితే లేడని చెబుతారు. చనిపోయాడా? అని ప్రశ్నిస్తే తెలియదు బాబూ అని జవాబిస్తారు.

అసలు ఇల్లు వదిలి ఎప్పుడు వెళ్లాడు అని మళ్లీ అడిగితే.. ఎప్పుడో పదేళ్ల క్రితం వెళ్లిపోయాడని చెబుతారు. ఎవరైనా ఊరికే ఎందుకెళ్లిపోతారు. వాళ్లను రాచి రంపాన పెడితేనే వదిలిపోతారు. ఇలాంటి దిక్కుమాలినోళ్లు ప్రతీ ఊరిలోనూ ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వీరందరికి వితంతు పెన్షన్లు వచ్చేలా చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మందికి పెన్షన్ అందజేస్తోందని తెలిపారు. 


  • Loading...

More Telugu News