Andhra Pradesh: కేవలం రూ.1,182 కోట్లు ఇస్తే.. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారమైపోతుంది!: వైసీపీ నేత పార్థసారధి

  • హాయ్ ల్యాండ్ అగ్రిగోల్డ్ సంస్థదే
  • గోదావరి పుష్కరాలకు రూ.4,500 కోట్లు వెచ్చించారు
  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన నేత
అగ్రిగోల్డ్ బాధితులను ఏపీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పార్థసారధి డిమాండ్ చేశారు. హాయ్ ల్యాండ్ అగ్రిగోల్డ్ సంస్థకు చెందినదని చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారని వ్యాఖ్యానించారు. అయితే హాయ్ ల్యాండ్ భూములపై కన్నేసిన ఏపీ ప్రభుత్వ పెద్దలు అది అగ్రిగోల్డ్ ఆస్తి కాదని చెప్పించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అలాగే తొలుత హాయ్ ల్యాండ్ ఆస్తులను రూ.5,000 కోట్లుగా లెక్కకెట్టిన సంస్థలు.. చివరికి రూ.2,500 కోట్లకు దిగివచ్చాయని విమర్శించారు.

అగ్రిగోల్డ్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రమంతటా కలెక్టరేట్ల ముందు వైసీపీ నేడు ఆందోళనకు దిగుతుందని ప్రకటించారు. గోదావరి పుష్కరాల కోసం చంద్రబాబు రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి, 40 మందిని చంపారని ఆరోపించారు. కేవలం రూ.1,182 కోట్లు ఇస్తే  దాదాపు 60 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆస్తులను కోర్టు దృష్టికి తీసుకెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకూ వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
Andhra Pradesh
YSRCP
agri gold
Telugudesam
Chandrababu
parthasarathi

More Telugu News