vote on budjet: ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌కు కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ఆర్థిక శాఖ

  • ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
  • కేంద్ర బడ్జెట్‌ తర్వాత పూర్తి బడ్జెట్‌ పెట్టాలన్న ఆలోచన
  • సార్వత్రిక ఎన్నికలు వస్తుండడమే కారణం

సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో కేంద్రంలో పరిస్థితులను చూసి ఆచితూచి అంచనా వేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు స్వీకరిస్తోంది.

ఫిబ్రవరిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్రం కూడా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్టే ప్రవేశ పెట్టనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్నే అనుసరించాలని నిర్ణయించింది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్నందున అంతకు ముందే బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఉన్నందున పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్పష్టత ఉండే అవకాశం లేదు. దీనివల్ల అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. ప్రభుత్వ సూచన మేరకు ఆర్థిక శాఖ ఆదేశాలతో ఆయా శాఖలు తమ పరిధిలో గత బడ్జెట్‌లో కేటాయింపులు, ఖర్చు వివరాలతో ప్రతిపాదను సిద్ధం చేస్తున్నాయి.  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం సూచించడంతో ఆ మేరకు అధికారులు లెక్కలు తయారు చేస్తున్నారు.

అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందాక ఈనెల రెండో వారంలో బడ్జెట్‌కు సంబంధించి ఓ ముసాయిదా తయారు చేసే యోచనలో ఆర్థిక శాఖ ఉంది. 2018-19 బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా రావాల్సిన నిధుల్లో నవంబరు వరకు 18 శాతం మాత్రమే వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ రాబడి లక్ష్యంలో 75 శాతం నవంబరు నాటికే పూర్తికావడం విశేషం.

More Telugu News