yadadri: ‘ఇదేం ఆశీర్వచనం? .. యాదాద్రి అర్చకులు, అధికారుల తీరుపై నరసింహన్ ఆగ్రహం!

  • నిన్న యాదాద్రిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
  • ప్రథమ పౌరుడికి ఆశీర్వచనం జరిపే తీరు ఇదేనా?
  • ఇందుకు సంబంధించిన పరిజ్ఞానం నాకు ఉంది 

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, అధికారులపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ఆయన కుటుంబసభ్యులు నిన్న సాయంత్రం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో బాలాలయం చేరుకున్న నరసింహన్ కు అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభం స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం, అక్కడి ఉత్సవ మంటపంలో గవర్నర్ దంపతులకు ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఇతర అర్చకులు, వేదపండితులు తూతూ మంత్రంగా ఆశీర్వచనం నిర్వహించారు.

దీంతో, వారి తీరుపై గవర్నర్ మండిపడ్డారు. ‘ఇదేం ఆశీర్వచనం? చతుర్వేద ఆశీర్వచనం చేయాలి కదా? ఆలయంలో ప్రథమ పౌరుడికి ఆశీర్వచనం జరిపే తీరు ఇదేనా? ఇందుకు సంబంధించిన పరిజ్ఞానం నాకు ఉంది కనుక గుర్తించాను. వేరే వారికి ఇలా చేయడం మంచిపద్ధతి కాదు’ అని వారిని గవర్నర్ హెచ్చరించారు.

కాగా, ఈ విషయమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయ ఈవో, వైటీడీఏ వైస్ చైర్మన్ ని గవర్నర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రాజ్ భవన్ కు వచ్చి  తనను కలవాలని ఆ అధికారులను ఆదేశించారని సమాచారం. ఇదిలా ఉండగా, సాధారణంగా గవర్నర్లు, స్పీకర్లు, ముఖ్యమంత్రులు ఆలయాన్ని సందర్శించినపుడు వారికి చతర్వేద పారాయణాలతో పాటు నాళాయార్ ప్రబంధ పారాయణాలు, మంగళశాసనాలతో మహదాశీర్వచనం చేయడం సంప్రదాయం. అయితే, గవర్నర్ నరసింహన్ దంపతులకు నిర్వహించిన ఆశీర్వచనం ఆలయాన్ని దర్శించే ప్రముఖులకు జరిపే సాధారణ ఆశీర్వచనంలా జరిపి,  అయిందనిపించారట. 

More Telugu News