Andhra Pradesh: న్యాయమూర్తులను సైతం చంద్రబాబు తప్పుదోవ పట్టించారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • నాడు సచివాలయం ఉద్యోగులను తప్పుదోవపట్టించారు
  • నేడు హైకోర్టు ఉద్యోగులను, రోడ్లపైకి తెచ్చారు
  • భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు

సీఎం చంద్రబాబునాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. నాడు విభజన సమయంలో ఓటుకు నోటు కేసులో చిక్కుకుని సచివాలయం ఉద్యోగులను, నేడు హైకోర్టు ఉద్యోగులను, న్యాయమూర్తులను రోడ్లపైకి తెచ్చి పడేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మండిపడ్డారు. తన చేతిలో పచ్చపత్రికలు, ఛానల్స్ ఉన్నాయి కదా అని కేంద్రం తప్పుచేసిందంటూ చంద్రబాబు బుకాయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు మాట నమ్మి నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనాన్ని చూసేందుకు  ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు సైతం నేలపాడుకు వచ్చారని, వారి వెంట మున్సిపల్ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ లు వచ్చి గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ కల్లా హైకోర్టు భవనాలు సిద్ధమంటూ సుప్రీంకోర్టుకు చంద్రబాబు ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందని, ఏపీలో హైకోర్టు భవనాలు అద్భుతంగా నిర్మిస్తున్నామంటూ ఢిల్లీలో సైతం గ్రాఫిక్స్ నమూనా భవనాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రదర్శించారని విమర్శించారు. ప్రస్తుతం అక్కడ బురద, ఏమాత్రం సిద్ధంగా లేని భవనాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సైతం తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News