Ravinder: మద్యం మత్తులో తల్లి.. ఆకలితో ఏడుస్తున్న చంటిపాప.. పాలిచ్చి ప్రాణాలు నిలిపిన మహిళా కానిస్టేబుల్!

  • రోడ్డుపై రోదిస్తున్న చంటిబిడ్డ
  • భార్యకు ఫోన్ చేసిన రవీందర్
  • అభినందించిన సీపీ అంజన్ కుమార్

భర్త ఫోనులో ఎవరో తెలియని చంటిబిడ్డ ఏడుపు విన్న ఆ తల్లి మనసు తల్లడిల్లింది. క్యాబ్ బుక్ చేసుకుని మరీ చిన్నారి ఉన్న ప్రదేశానికి వెళ్లి పాలిచ్చి చంటిబిడ్డ ప్రాణాలు నిలిపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నైట్ షిఫ్ట్‌లో ఉన్న రవీందర్ అనే కానిస్టేబుల్‌కు రోడ్డుపై చంటిపాప ఏడుస్తూ కనిపించింది. పక్కనే ఉన్న ఆ తల్లి మద్యం మత్తులో పడి ఉంది. దీంతో ఆ పాప తల్లి ఏమైనా స్పందిస్తుందేమోనని కాసేపు రవీందర్ ఎదురు చూశాడు. కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. వెంటనే బేగంపేట పీఎస్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భార్య ప్రియాంకకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు.

ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆ చంటిబిడ్డ ఏడుపు విన్న ప్రియాంక మనసు తల్లడిల్లింది. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని భర్త ఉన్న చోటుకి వెళ్లి బిడ్డను అక్కున చేర్చుకుని పాలిచ్చింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ పాపను ఆసుపత్రిలో చేర్పించారు. సకాలంలో పాలు అందబట్టే పాప ప్రాణం నిలిచింది.

పోలీసుల విచారణలో పాప తండ్రి ఓ జేబుదొంగ అని తేలింది. విషయం తెలుసుకున్న సీపీ అంజన్ కుమార్ కానిస్టేబుల్ దంపతులను అభినందించి ప్రియాంకకు బహుమతినిచ్చారు. ప్రియాంక ఆ బహుమతిని తన ఏడాది కొడుకుతో కలిసి అందుకుంది. విషయం తెలుసుకున్న వారంతా కానిస్టేబుల్ దంపతులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

More Telugu News