USA: జేబులో కాలిపోయిన ఐఫోన్.. నష్టపరిహారం కోసం కోర్టుకి ఎక్కుతున్న బాధితుడు!

  • అమెరికాలోని ఒహాయోలో ఘటన
  • మరో ఫోన్ ఇస్తామన్న ఐస్టోర్ నిర్వాహకులు
  • గతంలోనూ పేలిన స్మార్ట్ ఫోన్

అగ్రరాజ్యం అమెరికాలో ఓ యువకుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఐఫోన్ XS జేబులో పెట్టుకుని ఉండగా అది పొగలు కక్కుతూ ఒక్కసారిగా కాలిపోయింది. ఈ ఘటనలో యువకుడి కాలికి గాయమయింది. దీంతో సదరు బాధితుడు నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన జె.హిల్లర్డ్‌ అనే వ్యక్తి ఐఫోన్ XS ఫోన్ ను కొన్నాడు. ఈ నెల 12న భోజనం చేస్తుండగా కాలిన వాసన రావడం మొదలయింది. దీంతో వెంటనే ఫోన్ ను తీసేయబోగా మంటలు అంటుకుని అది కాలిపోయింది. ఈ క్రమంలో హిల్లర్డ్ కాలికి గాయమయింది. ఈ నేపథ్యంలో కాలిపోయిన ఫ్యాంటుకు, గాయానికి నష్టపరిహారం ఇవ్వాలని అతను ఐఫోన్ స్టోర్ నిర్వాహకుల్ని కోరాడు.

అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇందుకు నిరాకరించారు. కావాలంటే కొత్త ఫోన్ ఇస్తామని ప్రకటించారు. ఈ ఆఫర్ ను తిరస్కరించిన హిల్లర్డ్, దీనిపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. గతంలోనూ ఓసారి సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తుండగా ఐఫోన్ పేలిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

More Telugu News