Telangana: నీ బిడ్డకు తండ్రిని నేనే అని నిరూపించు.. అప్పుడే పెళ్లి చేసుకుంటా!: ప్రియురాలికి యువకుడి షాక్

  • తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో ఘటన
  • కోరిక తీర్చుకుని ముఖం చాటేసిన ప్రియుడు
  • ఇంటి ముందు బైఠాయించిన యువతి
ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాయమాటలు చెప్పాడు. దీంతో యువతి అతడిని ప్రేమించింది. అయితే కోరిక తీర్చుకున్న అనంతరం ఆమెను పెళ్లి చేసుకునేది లేదని సదరు ప్రబుద్ధుడు కరాఖండిగా చెప్పేశాడు. ఈ చర్యతో షాక్ కు గురైన బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన విజయ్ కుమార్, అదే గ్రామానికి చెందిన నాగమణి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగమణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన విజయ్ కుమార్ ఆమెను లొంగదీసుకున్నాడు. దీంతో నాగమణి గర్భం దాల్చింది. ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని నాగమణి కోరగా, విజయ్ కుమార్ అందుకు నిరాకరించాడు. అయితే పెద్దమనుషుల పంచాయితీ పెట్టడంతో పెళ్లికి అతను ఒప్పుకున్నాడు.

అంతలోనే నాగమణి గర్భం దాల్చడానికి, తనకు సంబంధం లేదని విజయ్ కుమార్ బుకాయించాడు. బిడ్డకు డీఎన్ ఏ పరీక్షలు చేసి తనకే పుట్టాడని నిర్ధారణ అయితేనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో బాధితురాలు విజయ్ కుమార్ ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. అక్కడే బైఠాయించింది.

ఈ నేపథ్యంలో విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకుని ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని సూచించారు. దీంతో తన కష్టాలను పోలీసులకు చెప్పుకున్న బాధితురాలు భోరుమని ఏడ్చింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
Telangana
Cheating
lover
Jayashankar Bhupalpally District
Police

More Telugu News