Chandrababu: ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై ఎంపీలతో ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్‌

  • రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • ఈ అంశంపై రాహుల్‌, మమతతో మాట్లాడానని వెల్లడి
  • ముస్లిం మైనార్టీ హక్కులుకాపాడాల్సి ఉందని వ్యాఖ్య

 ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలతో సోమవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటికే ఈ విషయమై తాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో మాట్లాడానని వెల్లడించారు. ముస్లింలపై వేధింపులను అడ్డుకోవాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ముస్లింలు అభద్రతకు గురైతే దేశ సమగ్రతకు మంచిదికాదని, దేశభవిష్యత్తును దెబ్బతీసేలా కేంద్రం చర్యలు ఉంటే వ్యతిరేకించాల్సిందేనని చెప్పారు. ముస్లింలను వేధింపులకు గురిచేయడం సరికాదని, దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని, లౌకికవాదం గొప్పతనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ముస్లింల హక్కుల కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడాలని, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై గొంతు బలంగా వినిపించాలని సూచించారు.

More Telugu News