Sharad Yadav: ప్రధాని నరేంద్రమోదీ ఎజెండా ఏంటో చెప్పిన శరద్ యాదవ్

  • రాఫెల్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మైఖేల్‌ను వాడుకుంటున్నారు
  • ప్రజలు అంత పిచ్చివారు కాదు
  • చౌకబారు రాజకీయాలతో ప్రజలను వంచించలేరు

ఓ కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కంకణం కట్టుకున్నారని, ఆయన ఎజెండా అదేనని ప్రతిపక్ష నేత శరద్ యాదవ్ ఆరోపించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశంలో అభివృద్ధే జరగలేదని బీజేపీ ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ కేసులో మధ్యవర్తి అయిన క్రిస్టియన్ మైఖేల్ తన న్యాయవాదులకు చిట్టీలు పంపి సోనియాగాంధీపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలని కోరుతున్నారంటూ ఈడీ అధికారులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో శరద్ యాదవ్ తాజా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

రాఫెల్ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మైఖేల్‌ను బీజేపీ వాడుకుంటోందన్నారు. అధికార పార్టీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని చెప్పడానికి తనకెంటువంటి సంకోచం లేదన్నారు. కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు సంస్థలను ఉసుగొల్పుతోందన్నారు. ప్రజలు తెలివి తక్కువ వారు కాదని, బీజేపీ అంతర్గత ఎజెండా ఏంటో ప్రజలు గుర్తించగలరని శరద్ యాదవ్ హెచ్చరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News