Bulandshahr: సీఐ సుబోధ్ సింగ్ హత్యపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • సీఐని ఎవరూ చంపలేదు
  • చేతిని కాల్చుకోబోయి కణతను కాల్చుకున్నాడు
  • ఆందోళనకారుల వద్ద తుపాకులంటే ఒక బుల్లెట్టే ఎలా దొరికింది?

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గో రక్షకులు జరిపిన హింసాకాండలో బలైన సీఐ సుబోధ్ కుమార్ సింగ్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 3న బులంద్‌షహర్‌లో జరిగిన హింసాకాండను అదుపు చేసేందుకు వెళ్లిన సీఐ సుబోధ్‌ ఆందోళనకారులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సుబోధ్‌ను కాల్చిన కారు డ్రైవర్‌ను రెండు రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. సుబోధ్‌ను కాల్చింది తానేనని అతడు అంగీకరించాడు కూడా.

తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ లోధీ మాట్లాడుతూ.. సీఐని ఎవరూ చంపలేదని, ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకుని ఉండొచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుబోధ్ కుమార్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టని, గతంలో కొన్ని ఎన్ కౌంటర్ల సమయంలో తన చేతులపై కాల్చుకునేవాడని అన్నారు. ఇప్పుడు కూడా తనను తాను రక్షించుకునే క్రమంలో చేతులపై కాల్చుకోవాలని అనుకున్నారని, అయితే అది గురితప్పి కణతలోకి దూసుకెళ్లి ఉంటుందని లోధీ పేర్కొన్నారు. సీఐ హత్య కేసులో అంతమంది నిందితులు ఎలా అవుతారని ప్రశ్నించిన ఆయన.. ఆందోళనకారులు రాళ్లు మాత్రమే విసిరారని పేర్కొన్నారు. అందరి వద్ద తుపాకులు ఉంటే.. సీఐ శరీరంలో ఒకే బుల్లెట్ ఎలా ఉందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News