India: మెల్ బోర్న్ లో ఎడతెరిపిలేని వర్షం... భారత విజయాన్ని అడ్డుకున్న వరుణుడు!

  • మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో మూడో టెస్టు
  • రెండు వికెట్లు తీస్తే విజయం భారత్ దే
  • గెలవాలంటే ఆసీస్ 141 పరుగులు చేయాల్సిందే

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ విజయానికి రెండు వికెట్లు అవసరం కాగా, నేడు నాలుగో రోజు ఇంతవరకూ ఒక్క బంతి కూడా పడలేదు. మెల్ బోర్న్ ప్రాంతంలో భారీ వర్షం పడుతూ ఉండటమే ఇందుకు కారణం. వర్షం తగ్గక పోవడంతో, లంచ్ విరామ సమయాన్ని పావుగంట ముందుకు జరుపుతున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

రెండో ఇన్నింగ్స్ లో 399 పరుగులు సాధించాల్సిన ఆస్ట్రేలియా, ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద ఉంది. భారత్ విజయం సాధించాలంటే రెండు వికెట్లు అవసరం కాగా, ఆస్ట్రేలియా గెలవాలంటే, ఇంకా 141 పరుగులు చేయాల్సివుంది. క్రీజులో పాట్ కుమిన్స్ 61 పరుగులతో నిలదొక్కుకుని ఉండగా, మరో ఎండ్ లో నాధన్ లియాన్ ఆరు పరుగులతో ఉన్నారు.

కాగా, వర్షం ఆగడంతో కవర్స్ ను తొలగించిన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది, నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం, మ్యాచ్ 7.30 గంటల తరువాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News