Andhra Pradesh: అనంతపురంలో మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన!

  • మంత్రి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శ
  • రాప్తాడులోని అవినీతి పత్రికల్లో కూడా వచ్చిందని వ్యాఖ్య
  • పరిటాల శ్రీరామ్ తీరును ఖండిస్తున్నట్లు ప్రకటన 

ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ కు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఈరోజు అనంతపురంలో ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. పరిటాల సునీత దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

రాప్తాడులో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో తీవ్రమైన అవినీతి చోటుచేసుకుందనీ, దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చాయని ఆరోపించారు. సాక్షి కార్యాలయం వద్ద పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో కలిసి ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే తరహాలో ప్రవర్తించారని గుర్తుచేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ప్రకాశ్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప ఇలా దౌర్జన్యానికి దిగడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, పరిటాల సునీతకు వ్యతిరేకంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని సప్తగిరి సర్కిల్ లో వైసీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో, పెనుకొండలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త శంకర నారాయణ, రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నాయి.

More Telugu News