Andhra Pradesh: హైకోర్టు కోసం తన క్యాంప్ ఆఫీసు.. అతిథుల కోసం తన బెడ్రూమ్ ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు!: జీవీఎల్ ఎద్దేవా

  • న్యాయ వ్యవస్థను బాబు కించపరిచారు
  • 12 నెలల సమయం ఇచ్చినా భవనం కట్టలేకపోయారు
  • జడ్జీలు, లాయర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఆంధప్రదేశ్ ప్రభుత్వ తీరుతో ఏపీ న్యాయవాదులు, జడ్జీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఇంతటి చేతకాని ముఖ్యమంత్రిని ఇప్పటివరకూ చూడలేదని ప్రజలు తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థను కించపరిచేలా ఏపీ ప్రభుత్వం చేసిన పనికి సీఎం చంద్రబాబుపై కోర్టు ధిక్కార నేరం కింద పిటిషన్ చేయవచ్చని వెల్లడించారు. కేవలం రెండంతస్తుల భవనాన్ని ఏపీ ప్రభుత్వం ఏడాది కాలంగా కట్టలేకపోయిందని గుర్తుచేశారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.

ఆంధ్రాకు రాబోతున్న న్యాయమూర్తులు, లాయర్లకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏడు నెలల్లో హైకోర్టు భవనాన్ని కడతామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయితే నిర్ణీత సమయంలోగా భవనాన్ని నిర్మించలేక కేంద్రంపై విమర్శలు చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. జనవరి 1 నుంచి సీఎం క్యాంప్ ఆఫీసులో హైకోర్టు పెట్టుకుందామనీ, అతిథులు బెడ్రూమ్ లో ఉండొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

12 నెలల గడువు పూర్తయినా హైకోర్టు భవనాన్ని కట్టలేకపోవడం చేతకానితనం కాదా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ‘హైకోర్టును నేనే తీసుకొచ్చా .. నేను టీడీపీ జాతీయ అధ్యక్షుడిని.. చంద్రబాబు టీడీపీ అంతర్జాతీయ అధ్యక్షుడు’ అంటూ తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.

More Telugu News