Jagan: జగన్ లా మేం గాలి తిరుగుళ్లు తిరుగుతూ గాలిమాటలు చెప్పడం లేదు!: ఏపీ మంత్రి సోమిరెడ్డి

  • ఏపీ అభివృద్ధి వైసీపీకి ఇష్టం లేదు
  • ఆనం మూడేళ్లలో 3 పార్టీల్లో చేరారు
  • మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రతిపక్ష వైసీపీకి ఇష్టం లేదని ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నామని తెలిపారు. కేంద్రం న్యాయం చేయకపోవడంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చామని వ్యాఖ్యానించారు. అంతేతప్ప జగన్ లా గాలి తిరుగుళ్లు తిరుగుతూ గాలిమాటలు చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు.

సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలకు పోటీగా బ్లాక్ పేపర్లు విడుదల చేస్తామని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పడంపై సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శ్వేతపత్రాల్లోని అంశాలను జాతీయ సంస్థలు రూపొందిస్తే, వాటిని చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. పలు రంగాల్లో ఏపీ అగ్రగామిగా నిలిస్తే గర్వపడాల్సింది పోయి సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

ఆనం రామనారాయణ రెడ్డి మూడేళ్లలో మూడు పార్టీల జెండాలు మోశారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బ్లాక్ పేపర్లు విడుదల చేస్తానని చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో జగన్ ను, వైఎస్ విజయమ్మను, కాంగ్రెస్ నేతలను ఆనం ఏ రీతిలో తిట్టారో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కేసీఆర్ ది ధనిక రాష్ట్రం అయినప్పటికీ అక్కడ రూ.లక్ష మాత్రమే రైతుల రుణాలను మాఫీ చేశారనీ, అదే ఏపీలో అప్పుల్లో ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం రూ.1.50 లక్షలు మాఫీ చేసిందని గుర్తుచేశారు.

More Telugu News