Madhukar Shetty: స్వైన్ ఫ్లూతో ఐపీఎస్ అధికారి డాక్టర్ మధుకర్ శెట్టి కన్నుమూత.. ఉదయమే మహా మృత్యుంజయ యాగం!

  • శుక్రవారం రాత్రి కన్నుమూత
  • హెచ్1 ఎన్1 వైరస్ సోకినట్టు చెప్పిన వైద్యులు
  • నిజాయతీ గల ఆఫీసర్‌గా గుర్తింపు

గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఇటీవల హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఐపీఎస్ అధికారి, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మధుకర్ శెట్టి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం ఆయనకు సర్జరీ నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు స్వైన్‌ ఫ్లూ వైరస్ హెచ్1 ఎన్1 సోకినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనను ఐసీయూకు తరలించి ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందించారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

1999 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మధుకర్ శెట్టి చిక్ మగుళూరు ఎస్పీగా, కర్ణాటక లోకాయుక్తగా పనిచేశారు. నిజాయతీపరుడిగా పేరు తెచ్చుకున్న ఆయన కోలుకోవాలంటూ బెంగళూరు సమీపంలోని బ్యాతరాయనపుర గ్రామస్థులు చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు. మధుకర్ మరణవార్త తెలిసి గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మధుకర్ స్వస్థలం కర్ణాటకలోని కుందపుర. తండ్రి ప్రముఖ కన్నడ జర్నలిస్ట్ వడ్డర్సె రఘురామ శెట్టి.

More Telugu News