Andhra Pradesh: హైకోర్టు విభజనకు, జగన్ పై ఉన్న కేసులకు మధ్య లింక్ ఉంది!: ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

  • హైకోర్టు విభజనలో కుట్రలు, కుతంత్రాలు
  • ఉద్యోగులకు మరింత సమయం ఇవ్వాల్సింది
  • ఆరో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల్లో పోటీచేసే అభ్యర్థులకు గరిష్టంగా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రాలో జనాభా వృద్ధికి ప్రత్యేకంగా పాలసీ తీసుకుని వస్తామని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని పేర్కొన్నారు. సామాజిక సమతుల్యం రావాలంటే యువత పెళ్లిచేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అమరావతిలో ఈరోజు ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి ఆరో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విషయంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు, వైఎస్ జగన్ పై నమోదయిన కేసులకు మధ్య లింక్ ఉందని చంద్రబాబు ఆరోపించారు. కేవలం హైకోర్టునే కాకుండా సీబీఐ కోర్టును కూడా విభజించాలని డిమాండ్ చేశారు. సీబీఐ కోర్టు విభజన జరిగితే జగన్ పై విచారణ పూర్తయిన కేసులన్నీ మళ్లీ మొదటికి వస్తాయని వ్యాఖ్యానించారు.

జగన్ కేసులపై అనుమానాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోందన్నారు. హైకోర్టు విభజనలో సైతం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని బాబు ఆరోపించారు. రాష్ట్ర విభజన తరహాలో హైకోర్టు విభజనకు సైతం మరికొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం నిర్ణయం కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు.

More Telugu News