Andhra Pradesh: ఐదో శ్వేతపత్రం విడుదల.. రెండు కోట్ల ఎకరాలకు సాగునీరివ్వాలన్నది లక్ష్యం: సీఎం చంద్రబాబు

  • ఏపీలో రెండు కోట్ల ఎకరాల సాగు యోగ్య భూమి ఉంది
  • ఇప్పటికే, గోదావరి- కృష్ణా నదులను అనుసంధానించాం 
  • ఏపీలో చిన్నా పెద్ద నదులన్నీ కలిసి 140 వరకూ ఉన్నాయి

గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒక్కో అంశంపై శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేశారు. తాజాగా, ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఐదో శ్వేతపత్రంను విడుదల చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం రెండు కోట్ల ఎకరాల సాగు యోగ్య భూమి ఉందని, ఈ భూమి అంతటికీ సాగునీరివ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఇప్పటికే, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పారు. ఫేజ్-1లో గోదావరి, పెన్నానదులను తీసుకోబోతున్నామని, ఫేజ్-2లో నాగార్జున కుడికాలవ నుంచి సోమశిలకు, వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదుల్ని అనుసంధానం చేస్తామని చెప్పారు.

ఏపీలో చిన్నా పెద్ద నదులన్నీ కలిసి 140 వరకు ఉన్నాయని, అన్ని నదుల్నీ అనుసంధానం చేయవచ్చని,  నీటిని పొదుపుగా వాడుకుంటే ఎక్కడా సమస్యే రాదని, సంప్రదాయేతర ఇంధన వనరుల్ని వాడుకుంటే కాలుష్యం తగ్గుతుందని సూచించారు. సోలార్ పవర్ వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, తద్వారా ఖర్చు, వనరులు ఆదా అవుతాయని అన్నారు.

 సేంద్రియ సాగు వల్ల మేలు రకమైన ఆహారం లభిస్తుందని, 2024 నాటికి రాష్ట్రంలో వ్యవసాయం అంతా సేంద్రియమేనని స్పష్టం చేశారు. ఏపీలో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించాలని, ఆక్సిజన్ పెంచాలన్నది లక్ష్యమని, అందుకే, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News