Andhra Pradesh: ఉమ్మడి హైకోర్టు విభజన సెగలు.. ఆందోళనకు దిగిన ఆంధ్రా లాయర్లు!

  • కొత్త హైకోర్టు భనవం పూర్తికాలేదని వ్యాఖ్య
  • దానికి ఇంకో 6 నెలలు పడుతుందని వెల్లడి
  • కటాఫ్ తేదీని పొడిగించాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనపై రచ్చ మొదలయింది. ఏపీ, తెలంగాణల మధ్య హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేయడంపై ఏపీ న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా అమరావతికి వెళ్లాలని చెప్పడంపై ఆందోళనకు దిగారు. అమరావతిలో కనీస సౌకర్యాలు లేవనీ, ఇప్పుడు అక్కడికెళ్లి ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో హైకోర్టు తయారు కావడానికి 6 నెలలు పడుతుందని వ్యాఖ్యానించారు. జనవరి 1 కల్లా తాత్కాలిక హైకోర్టు నిర్మాణం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు అఫిడవిట్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వాపోయారు. ఈ తప్పును సరిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. అమరావతిలో కడుతున్న తాత్కాలిక హైకోర్టుకు ఇప్పటివరకూ వెళ్లడానికి దారి కూడా లేదని సీనియర్ న్యాయవాది ఒకరు తెలిపారు. ఈ హైకోర్టు నిర్మాణం పూర్తి కావాలంటే మరో 6 నెలలు పడుతుందని స్పష్టం చేశారు. ఏపీ న్యాయవాదుల తరలింపు కటాఫ్ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. కేవలం నాలుగు రోజుల్లో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ విజయవాడకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. మరోవైపు హైకోర్టు విభజనపై కేంద్రం ఉత్తర్వులను తెలంగాణ న్యాయవాదులు స్వాగతించారు.

More Telugu News