Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం నిధులకు లెక్కలు చెప్పడంలేదు.. చంద్రబాబుకు మోదీ భయం పట్టుకుంది!: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • ప్రతిపక్షాలపై టీడీపీ కుట్ర చేస్తోంది
  • 2014 హామీల సంగతి ఏంటి?
  • పోలవరం కోసం వైఎస్ కృషి చేశారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఏపీని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని దుయ్యబట్టారు. 2019, జనవరి 6న గుంటూరులో ‘నిజం పిలుస్తోంది’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామనీ, దీనికి ప్రధాని మోదీ హాజరవుతారని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడారు.

నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారనగానే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. రోజూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు.. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలను చెప్పని ఏపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పోలవరం కోసం ఎంతోకొంత చేసిన నాయకుడు వైఎస్సార్ మాత్రమే అనీ, ఈ ప్రాజెక్టును టీడీపీ కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చలేదని పేర్కొన్నారు.

More Telugu News