Hyderabad: ప్రేమికురాలిని చంపుతానని బెదిరించిన యువకుడు.. పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

  • ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక
  • రోడ్డుపై అడ్డగించి చంపుతానని బెదిరింపు
  • అరెస్ట్ చేసిన పోలీసులు
తన నుంచి దూరంగా ఉంటున్న ప్రేమికురాలిని చంపుతానని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం శంకర్‌నగర్‌కు చెందిన షేక్ ఖలీం (20) వెల్డర్. ఆటోనగర్‌లో పనిచేస్తున్న అతడికి సరూర్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో గతేడాది పరిచయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో బాలిక ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. కుమార్తె ప్రేమ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో ఖలీంకు దూరంగా ఉంటోంది.

విషయం తెలిసిన ఖలీం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతడి ఆగడాలు మితిమీరడంతో పద్ధతి మార్చుకోవాలంటూ బాలిక కుటుంబ సభ్యులు ఖలీంను హెచ్చరించారు. అయినా, పద్ధతి మార్చుకోని ఖలీం ఈ నెల 22న దిల్‌సుఖ్‌నగర్‌లో బాలికను అడ్డగించాడు. తనతో మాట్లాడాలంటూ రోడ్డుపైనే ఆమెను దూషించాడు. తనను కాకుండా మరొకరిని పెళ్లాడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యుల సహకారంతో బాలిక పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖలీంను అరెస్ట్ చేశారు.
Hyderabad
Telangana
Malakpet
lover
police

More Telugu News