కేంద్రంలో బీజేపీ పోవాలి..మన రాష్ట్రానికి న్యాయం జరగాలి: సీఎం చంద్రబాబు

26-12-2018 Wed 17:45
  • బీజేపీకి ప్రత్యామ్నాయం రావాలి
  • ఎన్నికలు అయ్యే వరకూ నిద్ర పోవద్దు
  • కుట్రలు చేసేటప్పుడు ఎదురు నిలిచి పోరాడాలి
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పోవాలని, ప్రత్యామ్నాయం రావాలని, మన రాష్ట్రానికి న్యాయం జరగాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. అనంతపురంలో ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు అయ్యే వరకూ నిద్ర పోవద్దని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కుట్రలు చేసేటప్పుడు ఎదురు నిలిచి పోరాడాలని, లేకపోతే బలైపోతామని అన్నారు.

ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు ఎదురుతిరగాలని, అందుకే, ఎన్నికలు అయ్యే వరకు నిద్రపోవద్దని చెబుతున్నానని అన్నారు. అన్ని విషయాలను అధ్యయనం చేస్తున్నానని,  కార్యకర్తలకు ఆమోద యోగ్యంగా, ప్రజలకు అనుకూలంగా ఉండే వ్యక్తులే మళ్లీ ప్రజాప్రతినిధులు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనకు ఎటువంటి గ్రూప్ లు లేవని, మనకు ఒకటే గ్రూప్, ఒకే పార్టీ, ఒకే కుటుంబం..మనందరం ఒకటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 12వ ధర్మపోరాట దీక్ష సభను రాజధాని అమరావతిలో ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు.