pregnent lady: గర్భిణికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది.. కొరడా ఝుళిపించిన ప్రభుత్వం!

  • తమిళనాడులోని విరుదునగర్ లో ఘటన
  • రక్తాన్ని పరీక్షించని ల్యాబ్ సిబ్బంది
  • ముగ్గురిపై వేటేసిన ప్రభుత్వం
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఓ గర్భిణికి చికిత్స సందర్భంగా హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఎక్కించారు. దీంతో బాధితురాలి కుటుంబం ఆందోళనకు దిగింది. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈనెల 6న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విరుదునగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి చికిత్స కోసం ఈనెల 6న చేరింది. అయితే ఆమెకు రక్తం అవసరం కావడంతో ఆసుపత్రి సిబ్బంది బ్లడ్ బ్యాంకు నుంచి తెచ్చిన రక్తాన్ని ఎక్కించారు. ఈ సందర్భంగా దాత నుంచి సేకరించిన రక్తాన్ని ల్యాబ్ సిబ్బంది పరీక్షించలేదు. దీంతో హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఆసుపత్రి సిబ్బంది సదరు మహిళకు ఎక్కించేశారు. అయితే రక్తం దానం చేసిన వ్యక్తి విదేశాలకు వెళ్లే క్రమంలో రక్త పరీక్ష చేయించుకున్నాడు. దాంట్లో హెచ్ఐవీ, హెపటైటిస్-బి ఉన్నట్లు తేలింది.

దీంతో వెంటనే అతను బ్లడ్ బ్యాంకుకు ఫోన్ చేసి సమాచారం చెప్పాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణికి ఎక్కించేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బాధితురాలు లేదా ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కాగా, రెండేళ్ల క్రితం సదరు యువకుడు రక్తదానం చేసినప్పుడే అతనికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలినా ల్యాబ్ సిబ్బంది చెప్పలేదని విచారణలో తేలింది. అంతేకాకుండా ఇప్పుడు రక్త సేకరణ సమయంలోనూ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అతనికి రక్త పరీక్ష నిర్వహించలేదని వెల్లడయింది.
pregnent lady
hiv blood
injected
Tamilnadu
governement
hos[ital

More Telugu News