Dewegouda: అయ్యో రామా..! నన్నెవరూ తలచుకోలేదే!: దేవెగౌడ నిట్టూర్పు

  • 1997లో బోగీబీల్ వంతెనకు శంకుస్థాపన చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ
  • మంగళవారం నాడు వంతెనను ప్రారంభించిన నరేంద్ర మోదీ
  • తనను పిలవకపోవడంపై దేవెగౌడ అసంతృప్తి

దాదాపు 21 సంవత్సరాల క్రితం... 1997లో తాను ప్రధానిగా ఉన్న వేళ, ఇండియాలోనే అతిపెద్ద రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ గా, అరుణాచల్ ప్రదేశ్, అసోంలను కలుపుతూ, బ్రహ్మపుత్రా నదిపై 'బోగీబీల్' వంతెనకు శంకుస్థాపన చేసిన దేవెగౌడ, నిన్నటి వంతెన ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మనస్తాపం చెందారు.

సుమారు 5,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ 4.9 కిలోమీటర్ల పొడవైన వంతెనను, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన దేవెగౌడ, "కాశ్మీర్ కు రైల్వే లైన్, ఢిల్లీ మెట్రో, బోగీబీల్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ లను నేను ప్రధానిగా ఉన్నప్పుడే మంజూరు చేశాను. ఒక్కో ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయించి, పునాదిరాళ్లు వేశాను. ప్రజలు నన్నిప్పుడు మరచిపోయారు" అని దేవెగౌడ వ్యాఖ్యానించారు.

బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరుకాగా, వంతెన ప్రారంభం కావడంపై స్పందించాలని కొందరు విలేకరులు కోరిన వేళ ఆయన స్పందించారు. "అయ్యో రామా..! నన్ను ఎవరు గుర్తుంచుకుంటారు. కొన్ని దినపత్రికలు మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించాయి. ఈ ప్రాజెక్టు చాలా ఆలస్యం కావడం అసంతృప్తిని కలిగించింది. హనన్ - మైసూరు ప్రాజెక్టును 13 నెలల వ్యవధిలోనే పూర్తిచేశాను. ఘటప్రభా నదిపై అనగ్ వాడీ బ్రిడ్జ్ ని నిర్ణీత సమయంలో పూర్తి చేశాను. ఉత్తర కర్ణాటకకు నేనేమీ చేయలేదని కొందరు బాంబే కర్ణాటక ప్రాంత నేతలు అంటుంటారు. వెళ్లి చూసి ఆపై మాట్లాడండి" అని ఆయన అన్నారు.

More Telugu News