Congress: రంగా గారికి నివాళులర్పిస్తామంటే అరెస్టు చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?: కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ

  • విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో వంగవీటికి నివాళులు అర్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం 
  • అనుమతి నిరాకరించిన నగర పోలీసులు 
  • ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే విధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొలనుకొండ శివాజీ ఆరోపణ

  మాజీ ఎంఎల్‌ఏ, కాంగ్రెస్ నేత దివంగత వంగవీటి మోహనరంగా 30వ వర్థంతి సందర్భంగా ఈరోజు, రేపు విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో రంగా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇందు కోసం అనుమతి మంజూరు చేయాల్సిందిగా నగర పోలీసులకు అర్జీ పెట్టుకుంటే తిరస్కరించారని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఇది ప్రజాస్వామ్యమో, పోలీస్‌ రాజ్యమో తెలియడం లేదు. ప్రజాస్వామ్య వాదులంతా దీనిని తీవ్రంగా ఖండించాలి. నాడు టీడీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే రంగా హత్య గావించబడ్డారు. నేడు ఇదే టీడీపీ ప్రభుత్వం రంగాను స్మరించుకోవడాన్ని కూడా అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే విధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. 30వ వర్థంతి సందర్భంగా ప్రియతమ నేతకు శాంతియుతంగా నివాళులర్పించుకోవడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడం దారుణం. పైగా అటువంటి ప్రయత్నం చేస్తే అరెస్టులు చేస్తామని మమ్మల్ని బెదిరించారు. పేదల పెన్నిధి వంగవీటి మోహన రంగా అంటే పాకిస్తాన్‌ ఉగ్రవాది అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

పోలీసులు, ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే బ్రిటీషు పాలకుల నిర్బంధకాండను తలపిస్తున్నది. ర్యాలీలు, ప్రదర్శనలు చేయకుండా కేవలం షామియానా వేసి సైకత శిల్పం ఏర్పాటు చేసి నివాళులర్పిస్తే, శాంతి భద్రతలకు ఏ విధంగా భంగం వాటిల్లుతుందో పోలీసులకే తెలియాలి. లెనిన్‌ సెంటర్‌లో సైకత శిల్పం ఏర్పాటుకు అనుమతించకపోవడం ద్వారా లక్షలాదిమంది రంగా అభిమానుల హృదయాలను గాయపర్చిన సంబంధిత నగర పోలీసు అధికారులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి" అని కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News