TRS: టీఆర్ఎస్‌లోకి రమ్మని భారీ ఆఫర్లు వచ్చిన మాట నిజమే: అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

  • ఆప్తుడైన తుమ్మల పిలిస్తేనే పార్టీ మారలేదు
  • ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచీ పార్టీలోనే ఉన్నా
  • ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ మారేది లేదు

టీఆర్ఎస్ నుంచి తనకు భారీ ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమేనని అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. తనకు ఆప్తుడైన తుమ్మల నాగేశ్వరరావు పిలిస్తేనే ఆ పార్టీలోకి వెళ్లలేదని, ఇప్పుడెలా వెళ్తానని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచీ టీడీపీలోనే ఉన్నానన్న ఆయన.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అశ్వారావుపేటలో చిన్నకార్ల యజమానుల యూనియన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ నుంచి ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించినట్టు చెప్పారు. పార్టీ మారితేనే అభివృద్ధి చేస్తారా? లేకపోతే చేయరా? అని ప్రశ్నించారు. ప్రజలకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లైనా న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ప్రతిపక్షాలు లేకుండా పోతే, అది ప్రజాస్వామ్యం కాబోదన్నారు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. తనను మంచి నాయకుడిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తాను టీడీపీ తరపున పోటీ చేసినా అందరూ ఓట్లు వేసి గెలిపించారని, అందరి అవసరాల కోసం తాను పనిచేస్తానని మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు.

More Telugu News