Andhra Pradesh: ఆంధ్రా సీఆర్డీఏలో ఉద్యోగాల పేరిట మోసం.. తీవ్రంగా నష్టపోయిన యువకుడు!

  • కృష్ణా జిల్లా యువకుడికి కుచ్చుటోపి
  • నగదు వసూలు చేసి పరారైన జంట
  • కేసు నమోదుచేసిన పోలీసులు

మోసగాళ్లను నమ్మవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా చదువుకున్నవారు సైతం వినడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడికి ఓ జంట కుచ్చుటోపి పెట్టింది. అతని నుంచి భారీగా నగదును వసూలు చేసి పరారయింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పెనమలూరుకు చెందిన విశ్వచైతన్య ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో సీఆర్డీఏలో ఖాళీలు ఉన్నాయనీ, కేవలం రూ.4 లక్షలు చెల్లిస్తే చాలని సతీశ్, నవనీత అనే దంపతులు అతడిని నమ్మబలికారు. దీంతో వీరిని నమ్మిన విశ్వచైతన్య వాళ్లు చెప్పినట్లే రూ.4 లక్షలు చేతిలో పెట్టాడు.

అయితే డబ్బు తీసుకున్న తర్వాత ఈ జంట అందుబాటులో లేకుండా పోయింది. అంతేకాకుండా ఫోన్ నంబర్ ను సైతం మార్చేసింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పెనమలూరు పోలీసులను ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News